సాంఖ్యయోగ
అథ ద్వితీయోఽధ్యాయః
శ్లోక 2
శ్రీభగవానువాచ |
కుతస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితమ్ |
అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తికరమర్జున ||౨-౨||
అనువాదం
శ్రీ భగవానుడు ఇట్లనెను: ప్రియమైన అర్జునా, ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ చిత్త భ్రాంతి ఎట్లా దాపురించింది? ఇది గౌరవనీయ వ్యక్తికి తగదు. ఇది ఉత్తమ లోకాలకు దారి తీసేది కాకపోగా, అపకీర్తి పాలుజేస్తుంది.
శ్లోక 5
గురూనహత్వా హి మహానుభావాన్
శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే |
హత్వార్థకామాంస్తు గురూనిహైవ
భుఞ్జీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్ ||౨-౫||
అనువాదం
నా గురువులైన ఈ పెద్దలను సంహరించి ఈ భోగాలని అనుభవించటం కంటే యాచకుడిగా బ్రతకటం మేలు. వీరిని చంపితే, మనము అనుభవించే ఈ సంపద, భోగాలు, రక్తంతో కళంకితమై ఉంటాయి.
శ్లోక 6
న చైతద్విద్మః కతరన్నో గరీయో
యద్వా జయేమ యది వా నో జయేయుః |
యానేవ హత్వా న జిజీవిషామస్-
తేఽవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః ||౨-౬||
అనువాదం
ఈ యుద్ధం యొక్క ఎలాంటి ఫలితం మనకు మేలైనదో కూడా మనకు తెలియదు - వాళ్ళను జయించడమా లేదా వారిచే జయింపబడటమా. వారిని సంహరించిన తరువాత కూడా, మనకు జీవించాలని అనిపించదు. అయినా, వారు ధృతరాష్ట్రుని పక్షంలో చేరి, మన ఎదురుగా యుద్ధభూమిలో నిలిచి ఉన్నారు.
శ్లోక 7
కార్పణ్యదోషోపహతస్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః |
యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తేఽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్ ||౨-౭||
అనువాదం
నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియటంలేదు మరియు ఆందోళన, పిరికితనము నన్ను ఆవహించాయి. నేను నీ శిష్యుడను, నీకు శరణాగతుడను. నాకు నిజముగా ఏది శ్రేయస్కరమో దానిని ఉపదేశించుము.
శ్లోక 8
న హి ప్రపశ్యామి మమాపనుద్యాద్
యచ్ఛోకముచ్ఛోషణమిన్ద్రియాణామ్ |
అవాప్య భూమావసపత్నమృద్ధం
రాజ్యం సురాణామపి చాధిపత్యమ్ ||౨-౮||
అనువాదం
నా ఇంద్రియములను శుష్కింప చేస్తున్న ఈ శోకమును పోగొట్టే ఉపాయమేదీ తోచటం లేదు. నేను ఈ భూమిపై సుసంపన్నమైన, ఎదురులేని రాజ్యాన్ని గెలిచినా, లేదా దేవతల వంటి ఆధిపత్యము పొందినా, ఈ శోకమును తొలగించుకోలేను.
శ్లోక 11
శ్రీభగవానువాచ |
అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే |
గతాసూనగతాసూంశ్చ నానుశోచన్తి పణ్డితాః ||౨-౧౧||
అనువాదం
భగవంతుడు ఇలా అన్నాడు: నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు కానీ శోకింపకూడని దాని కోసం శోకిస్తున్నావు. ప్రాణములు పోయిన వారి గురించి గానీ బ్రతికున్న వారి గురించి గానీ, పండితులైనవారు శోకింపరు.
శ్లోక 13
దేహినోఽస్మిన్యథా దేహే కౌమారం యౌవనం జరా |
తథా దేహాన్తరప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి ||౨-౧౩||
అనువాదం
ఏ విధంగానైతే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యము, యౌవనం, ముసలితనముల గుండా సాగిపోతుందో, అదేవిధముగా మరణ సమయంలో, జీవాత్మ మరియొక దేహం లోనికి ప్రవేశిస్తుంది. వివేకవంతులు ఈ విషయమున భ్రమకు లోనవ్వరు.
శ్లోక 14
మాత్రాస్పర్శాస్తు కౌన్తేయ శీతోష్ణసుఖదుఃఖదాః |
ఆగమాపాయినోఽనిత్యాస్తాంస్తితిక్షస్వ భారత ||౨-౧౪||
అనువాదం
ఓ కుంతీపుత్రా, ఇంద్రియ-విషయములతో సంయోగము వలన ఇంద్రియములకు క్షణభంగురమైన, అనిత్యమైన సుఖ-దుఃఖాలు కలిగినట్లు అనిపిస్తుంది. ఇవి అనిత్యములు మరియు ఇవి వేసవి, చలికాలములలా వచ్చిపోతుంటాయి. ఓ భరత వంశీయుడా, కలత చెందకుండా వీటిని ఓర్చుకోవటం నేర్చుకోవాలి.
శ్లోక 20
న జాయతే మ్రియతే వా కదాచిన్
నాయం భూత్వా భవితా వా న భూయః |
అజో నిత్యః శాశ్వతోఽయం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే ||౨-౨౦||
అనువాదం
ఆత్మకి పుట్టుక లేదు, ఎన్నటికీ మరణం కూడా ఉండదు. ఒకప్పుడు ఉండి, ఇకముందు ఎప్పుడైనా అంతమైపోదు. ఆత్మ జన్మ లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది, మరియు వయోరహితమైనది. శరీరం నశించిపోయినప్పుడు అది నశించదు.
శ్లోక 29
ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేన-
మాశ్చర్యవద్వదతి తథైవ చాన్యః |
ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి
శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ ||౨-౨౯||
అనువాదం
కొందరు ఈ ఆత్మని ఆశ్చర్యమైనదిగా చూస్తారు, కొందరు ఆశ్చర్యమైనదిగా వర్ణిస్తారు, మరియు కొందరు ఆత్మ ఆశ్చర్యమైనదని వింటారు, మరికొందరు, విన్న తరువాత కూడా దీని గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేరు.
శ్లోక 37
హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్ |
తస్మాదుత్తిష్ఠ కౌన్తేయ యుద్ధాయ కృతనిశ్చయః ||౨-౩౭||
అనువాదం
యుద్ధం చేస్తే నీవు, యుద్ధ రంగంలో వీరమరణం పొంది స్వర్గానికి పోయెదవు, లేదా విజయుడవై ఈ భూమండలముపై రాజ్యమును అనుభవించెదవు. కావున, కృత నిశ్చయుడవై లెమ్ము, ఓ కుంతీ పుత్రుడా, యుద్ధానికి సిద్ధముకమ్ము.
శ్లోక 39
ఏషా తేఽభిహితా సాఙ్ఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు |
బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబన్ధం ప్రహాస్యసి ||౨-౩౯||
అనువాదం
ఇప్పటివరకు, నేను నీకు సాంఖ్య యోగం, అంటే, ఆత్మ తత్త్వం గురించి విశ్లేషణాత్మక జ్ఞానంను, వివరించాను. ఇప్పుడు వినుము, ఓ పార్థ, నేను బుద్ధి యోగాన్ని విశదీకరిస్తాను. ఇలాంటి అవగాహనతో పని చేసినప్పుడు, నీవు కర్మ బంధములనుండి విముక్తి పొందెదవు.
శ్లోక 42, 43, 44
యామిమాం పుష్పితాం వాచం ప్రవదన్త్యవిపశ్చితః |
వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః ||౨-౪౨||
కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదామ్ |
క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి ||౨-౪౩||
భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసామ్ |
వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే ||౨-౪౪||
అనువాదం
పరిమితమైన అవగాహన కలవారు, స్వర్గలోక ప్రాప్తి కోసం, డాంభికమైన కర్మకాండలను ప్రతిపాదించే వేదాల్లో చెప్పబడిన సమ్మోహపరచే మాటలకు ఆకర్షితులౌతారు మరియు అందులో ఇంకా ఏమీ ఉన్నత స్థాయి ఉపదేశం లేదనుకుంటారు. తమకు ఇంద్రియ సుఖాలని ప్రాప్తింపచేసే వేదాల్లోని ఆయా భాగాలని ప్రశంసిస్తారు మరియు ఉన్నత జన్మ, ఐశ్వర్యం, ఇంద్రియ భోగాలు, మరియు స్వర్గలోక ప్రాప్తి కోసం ఆడంబరమైన కర్మకాండలు చేస్తుంటారు. ప్రాపంచిక భోగాలు, సుఖాల పట్ల మనస్సు మిక్కిలి మమకారాసక్తితో ఉండి మరియు వారి బుద్ధులు ఇటువంటి వాటిచే చిత్తభ్రాంతికి లోనయ్యి, వారు, భగవత్-ప్రాప్తి పథంలో సాఫల్యానికి కావలసిన దృఢ సంకల్పాన్ని కలిగి ఉండలేరు.
శ్లోక 45
త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున |
నిర్ద్వన్ద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ ||౨-౪౫||
అనువాదం
ఓ అర్జునా, వేదములు భౌతిక ప్రకృతి యొక్క త్రి-గుణాత్మకమైన విషయ సంబంధమై వివరించును. నీవు ఈ త్రిగుణములకు అతీతంగా శుద్ధ ఆధ్యాత్మిక చైతన్య స్థితిలో ఉండుము. ద్వంద్వముల నుండి విడివడి, నిత్యమూ పరమ-సత్యంలో స్థితమై ఉండి, మరియు భౌతిక లాభాలు, భద్రతల గురించి పట్టించుకోకుండా, ఆత్మ భావన యందే స్థితుడవై ఉండుము.
శ్లోక 46
యావానర్థ ఉదపానే సర్వతః సమ్ప్లుతోదకే |
తావాన్సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః ||౨-౪౬||
అనువాదం
ఒక చిన్న నీటి బావితో తీరే అన్ని ప్రయోజనాలు సహజంగానే ఒక పెద్ద నీటి కొలనుతో తీరుతాయి. అదే ప్రకారంగా, పరమ సత్యాన్ని ఎరిగి భగవత్ ప్రాప్తి నొందిన వ్యక్తి అన్ని వేదముల లక్ష్యాన్ని నెరవేర్చినట్టే.
శ్లోక 47
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |
మా కర్మఫలహేతుర్భూర్మా తే సఙ్గోఽస్త్వకర్మణి ||౨-౪౭||
అనువాదం
శాస్త్రవిహిత కర్తవ్య కర్మను ఆచరించుటయందే నీకు అధికారము కలదు, కానీ ఆ కర్మ ఫలముల పైన నీకు హక్కు లేదు. నీవే కర్మ ఫలములకు హేతువు అని ఎప్పుడూ అనుకోకు మరియు చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తి ఉండరాదు.
శ్లోక 49
దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనఞ్జయ |
బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః ||౨-౪౯||
అనువాదం
దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంను ఆశ్రయించుము, ఓ అర్జునా, ఫలాపేక్షతో చేసే పనులను త్యజించుము; బుద్ధిని ఆధ్యాత్మిక దివ్యజ్ఞానంలో స్థిరంగా ఉంచి చేసే పనుల కన్నా, అవి నిమ్న స్థాయికి చెందినవి. తమ కర్మ ఫలములను తామే భోగించగోరే వారు లోభులు/పిసినారులు.
శ్లోక 51
కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః |
జన్మబన్ధవినిర్ముక్తాః పదం గచ్ఛన్త్యనామయమ్ ||౨-౫౧||
అనువాదం
జ్ఞానులు, సమత్వ బుద్ధి కలిగి ఉండి, జననమరణ చక్రంలో బంధించే కర్మ ఫలములపై మమకార-ఆసక్తులను త్యజించి ఉంటారు. ఇలాంటి దృక్పథంతో పని చేయటం వలన సమస్త దుఃఖములకు అతీతమైన స్థితిని పొందెదరు.
శ్లోక 54
అర్జున ఉవాచ |
స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ |
స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్ ||౨-౫౪||
అనువాదం
అర్జునుడు పలికెను: ఓ కేశవా, భగవత్ ధ్యాస యందే స్థిరముగా ఉన్న (స్థితప్రజ్ఞుని) వాని లక్షణములు ఏమిటి? జ్ఞానోదయం అయిన వ్యక్తి ఎలా మాట్లాడును? ఎలా కూర్చొనును? ఎలా నడుచును?
శ్లోక 55
శ్రీభగవానువాచ |
ప్రజహాతి యదా కామాన్సర్వాన్పార్థ మనోగతాన్ |
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే ||౨-౫౫||
అనువాదం
భగవానుడు పలికెను: ఓ పార్థ, మనస్సుని వేధించే అన్నీ స్వార్థ ప్రయోజనాలను, ఇంద్రియవాంఛలను త్యజించి ఆత్మ జ్ఞానంలో సంతుష్టుడైనప్పుడు, ఆ వ్యక్తిని స్థిత ప్రజ్ఞుడు అంటారు.
శ్లోక 62 మరియు 63
ధ్యాయతో విషయాన్పుంసః సఙ్గస్తేషూపజాయతే |
సఙ్గాత్సఞ్జాయతే కామః కామాత్క్రోధోఽభిజాయతే ||౨-౬౨||
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్స్మృతివిభ్రమః |
స్మృతిభ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి ||౨-౬౩||
అనువాదం
ఇంద్రియ విషయముల మీద చింతన చేయటం వలన వాటి మీద మమకారాసక్తి పెరుగుతుంది. ఈ ఆసక్తి కోరికలను కలుగ చేస్తుంది, మరియు కోరికల నుండి క్రోధం ఉత్పన్నమవుతుంది. కోపం అనేది విచక్షణా రాహిత్యానికి దారి తీస్తుంది, అది స్మృతి (జ్ఞాపకశక్తి) భ్రమని కలుగ చేస్తుంది. స్మృతిభ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మనుష్యుడు పతనమౌతాడు.
శ్లోక 66
నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా |
న చాభావయతః శాన్తిరశాన్తస్య కుతః సుఖమ్ ||౨-౬౬||
అనువాదం
కానీ, మనస్సు-ఇంద్రియములను నియంత్రించని క్రమశిక్షణ లేని వ్యక్తికి, స్థిరమైన బుద్ధి కానీ, నిలకడైన భగవత్ ధ్యాస కానీ ఉండవు. ఎవరైతే మనస్సుతో భగవంతుని యందు ఎన్నడూ ఐక్యమవడో వానికి శాంతి ఉండదు; మరియు మనశ్శాంతి లోపించినవాడు సంతోషంగా ఎలా ఉండగలడు?
శ్లోక 70
ఆపూర్యమాణమచలప్రతిష్ఠం
సముద్రమాపః ప్రవిశన్తి యద్వత్ |
తద్వత్కామా యం ప్రవిశన్తి సర్వే
స శాన్తిమాప్నోతి న కామకామీ ||౨-౭౦||
అనువాదం
ఎన్నో నదులు తనలో నిత్యం కలుస్తున్నా, ఎలాగైతే సముద్రం నిశ్చలంగా/ప్రశాంతంగా ఉంటుందో, అదేవిధంగా ఎన్నో వాంఛనీయ వస్తువులు తన చుట్టూ వస్తూనే ఉన్నా, చలించని యోగి శాంతిని పొందుతాడు; కోరికలను సంతృప్తిపర్చుకోవటానికే కృషి చేసే వ్యక్తి ఇది పొందడు.
శ్లోక 72
ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి |
స్థిత్వాస్యామన్తకాలేఽపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి ||౨-౭౨||
అనువాదం
ఓ పార్థ, జ్ఞానోదయం కలిగిన జీవాత్మ స్థితి ఎలా ఉంటుందంటే, ఒకసారి జ్ఞానోదయం కలిగిన తరువాత ఇక మళ్లీ అది మాయలో పడదు. మరణ సమయంలో కూడా ఈ వివేకంతో స్థిరంగా ఉన్న ఇటువంటి వ్యక్తి, జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది, ఆ భగవంతుని దివ్య ధామానికి చేరుకుంటాడు.
కేవలం చదవడం మాత్రమే కాదు—
మీ స్వంత ధ్యాన వీడియోలను సృష్టించండి.
పవిత్ర శ్లోకాలను ప్రపంచంతో పంచుకోవడానికి అందమైన, సినిమాటిక్ వీడియోలుగా మార్చండి. మీ నేపథ్యాన్ని ఎంచుకోండి, మంత్రోచ్ఛారణ ఆడియోను జోడించండి మరియు ఆధునిక ఆకృతిలో గీత వెలుగును ప్రసరింపజేయండి.
ఈ ఫీచర్ల కోసం యాప్ డౌన్‌లోడ్ చేయండి
- అధిక నాణ్యత గల నేపథ్య కళాకృతి
- సమకాలీకరించబడిన సంస్కృత మరియు అర్థ పాఠం
- లీనమయ్యే మంత్రోచ్ఛారణ & సంగీతం
లోతైన అనుభూతిని పొందండి
నిత్య గీత పూర్తి వెర్షన్తో సినిమాటిక్ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించండి. అధిక నాణ్యత గల మంత్రోచ్ఛారణ, ప్రామాణిక అనువాదాలు మరియు మీ అరచేతిలో ఒక ప్రశాంతమైన ధ్యాన అభయారణ్యం.