రాజవిద్యా రాజగుహ్యయోగ
అథ నవమోధ్యాయః
శ్లోక 1
శ్రీభగవానువాచ |
ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే |
జ్ఞానం విజ్ఞానసహితం యజ్జ్ఞాత్వా మోక్ష్యసేఽశుభాత్ ||౯-౧||
అనువాదం
శ్రీ భగవానుడు పలికెను: ఓ అర్జునా, నీకు నామీద అసూయ లేదు కాబట్టి, ఈ యొక్క అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని మరియు అనుభవపూర్వక విజ్ఞానాన్ని ఇప్పుడు నేను నీకు తెలియజేస్తాను; ఇది తెలుసుకున్న తరువాత నీవు భౌతికసంసార బాధల నుండి విముక్తి చేయబడుతావు.
శ్లోక 2
రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్ |
ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్ ||౯-౨||
అనువాదం
ఈ జ్ఞానం అన్ని విద్యలకు రారాజు మరియు అత్యంత గోప్యమయినది. ఇది విన్న వారిని పవిత్రం చేస్తుంది. ఇది నేరుగా అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి వీలైనది, ధర్మ బద్ధమైనది, ఆచరించటానికి సులువైనది, శాశ్వతమైన ఫలితమును ఇచ్చేటటువంటిది.
శ్లోక 3
అశ్రద్దధానాః పురుషా ధర్మస్యాస్య పరన్తప |
అప్రాప్య మాం నివర్తన్తే మృత్యుసంసారవర్త్మని ||౯-౩||
అనువాదం
ఈ ధర్మము యందు విశ్వాసము లేని జనులు, నన్ను పొందలేకున్నారు, ఓ శత్రువులను జయించేవాడా. వారు పదేపదే జనన-మరణ చక్రంలో ఈ లోకానికి తిరిగి వస్తుంటారు.
శ్లోక 4
మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా |
మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః ||౯-౪||
అనువాదం
ఈ సమస్త విశ్వమూ నా అవ్యక్త స్వరూపంచే వ్యాపింపబడి ఉన్నది. సమస్త ప్రాణులు నా యందే స్థితమై ఉన్నాయి కాని నేను వాటి యందు స్థితుడనుకాను.
శ్లోక 5
న చ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్ |
భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః ||౯-౫||
అనువాదం
అయినా సరే, ప్రాణులు నాలో స్థిరముగా ఉండవు. నా దివ్య శక్తి యొక్క అద్భుతమును తిలకించుము! నేనే సమస్త ప్రాణుల సృష్టి కర్తను మరియు నిర్వాహకుడను అయినా, నేను వాటిచే కానీ లేదా భౌతిక ప్రకృతిచే కానీ ప్రభావితము కాను.
శ్లోక 6
యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్రగో మహాన్ |
తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ ||౯-౬||
అనువాదం
అంతటా వీచే ప్రబలమైన గాలి కూడా, ఎల్లప్పుడూ ఆకాశంలోనే స్థితమై ఉన్నట్టు, అదే విధంగా, సర్వ ప్రాణులు కూడా ఎల్లప్పుడూ నా యందే స్థితమై ఉంటాయి.
శ్లోక 7
సర్వభూతాని కౌన్తేయ ప్రకృతిం యాన్తి మామికామ్ |
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్ ||౯-౭||
అనువాదం
కల్పాంతరమున (ఒక కల్పము చివరన), సమస్త ప్రాణులు నా యొక్క ఆదిమ ప్రకృతి శక్తి యందు విలీనమవుతాయి. తదుపరి సృష్టి ప్రారంభంలో, ఓ కుంతీ పుత్రుడా, నేను వాటిని మరల వ్యక్తపరుస్తాను. నా ప్రాకృతిక (భౌతిక) శక్తిని అధీనంలో ఉంచుకొని, ఈ అసంఖ్యాకమైన జీవ రాశులను, వాటి వాటి స్వభావాల అనుగుణంగా, మరల మరల సృష్టిచేయుచున్నాను.
శ్లోక 8 మరియు 9
ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః |
భూతగ్రామమిమం కృత్స్నమవశం ప్రకృతేర్వశాత్ ||౯-౮||
న చ మాం తాని కర్మాణి నిబధ్నన్తి ధనఞ్జయ |
ఉదాసీనవదాసీనమసక్తం తేషు కర్మసు ||౯-౯||
అనువాదం
కల్పాంతరమున (ఒక కల్పము చివరన), సమస్త ప్రాణులు నా యొక్క ఆదిమ ప్రకృతి శక్తి యందు విలీనమవుతాయి. తదుపరి సృష్టి ప్రారంభంలో, ఓ కుంతీ పుత్రుడా, నేను వాటిని మరల వ్యక్తపరుస్తాను. నా ప్రాకృతిక (భౌతిక) శక్తిని అధీనంలో ఉంచుకొని, ఈ అసంఖ్యాకమైన జీవ రాశులను, వాటి వాటి స్వభావాల అనుగుణంగా, మరల మరల సృష్టిచేయుచున్నాను. ఓ సిరి-సంపదలను జయించే వాడా, ఈ కార్యములు ఏవీ నన్ను బంధించలేవు. నేను ఒక తటస్థ పరిశీలకుడిగా, ఈ కర్మలు ఏవీ నన్ను అంటకుండా అనాసక్తతతో ఉంటాను.
శ్లోక 10
మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరమ్ |
హేతునానేన కౌన్తేయ జగద్విపరివర్తతే ||౯-౧౦||
అనువాదం
నా యొక్క నిర్దేశంలో పని చేస్తూ, ఈ భౌతిక శక్తి, సమస్త చరాచర భూతములను జనింపచేయును, ఓ కుంతీ పుత్రుడా. ఈ కారణం వలన, భౌతిక జగత్తు మార్పుకు లోనగుచుండును (సృష్టి, స్థితి, మరియు లయములు).
శ్లోక 11
అవజానన్తి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్ |
పరం భావమజానన్తో మమ భూతమహేశ్వరమ్ ||౯-౧౧||
అనువాదం
నేను నా సాకారమనుష్య రూపంలో అవతరించినప్పుడు, మూఢులు నన్ను గుర్తించలేకున్నారు. సకల భూతములకు మహేశ్వరుడైన నా వ్యక్తిత్వం యొక్క దివ్యత్వము వారికి తెలియదు.
శ్లోక 12
మోఘాశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః |
రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః ||౯-౧౨||
అనువాదం
భౌతిక మాయా శక్తిచే భ్రమకు లోనైనటువంటి జనులు ఆసుర, నాస్తిక భావాలను పెంపొందించుకుంటారు. ఆ అయోమయ స్థితిలో, అభ్యుదయం/సంక్షేమం కోసం వారి ఆశలు వ్యర్థమవుతాయి, వారు ఫలాసక్తితో చేసే కర్మలు అన్ని నిష్ఫలమే మరియు వారి జ్ఞానం అయోమయ స్థితిలో ఉంటుంది.
శ్లోక 13
మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః |
భజన్త్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్ ||౯-౧౩||
అనువాదం
కానీ, నా యొక్క దివ్యమైన శక్తిని ఆశ్రయించిన మహాత్ములు, ఓ పార్థ, నన్నే, శ్రీ కృష్ణ పరమాత్మనే, సమస్త సృష్టికి ఆది-మూలమని తెలుసుకుంటారు. అనన్య చిత్తముతో, కేవలం నాయందే మనస్సు లగ్నంచేసి వారు నా భక్తిలో నిమగ్నమౌతారు.
శ్లోక 14
సతతం కీర్తయన్తో మాం యతన్తశ్చ దృఢవ్రతాః |
నమస్యన్తశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే ||౯-౧౪||
అనువాదం
ఎల్లప్పుడూ నా దివ్య లీలలను/మహిమలను గానం చేస్తూ, దృఢ-సంకల్పముతో పరిశ్రమిస్తూ, వినయముతో నా ముందు ప్రణమిల్లుతూ, నిరంతరం వారు నన్ను ప్రేమ యుక్త భక్తితో ఆరాధిస్తుంటారు.
శ్లోక 15
జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజన్తో మాముపాసతే |
ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖమ్ ||౯-౧౫||
అనువాదం
మరికొందరు, జ్ఞాన సముపార్జనా యజ్ఞములో నిమగ్నమై, నన్ను చాలా రకాలుగా ఆరాధిస్తారు. కొందరు నన్ను తమతో అభేదమైన ఏకత్వముగా చూస్తారు, మరికొందరు నన్ను తమకంటే వేరుగా పరిగణిస్తారు. ఇంకా కొందరు నా యొక్క విశ్వ రూపము యొక్క అనంతమైన ఆవిర్భావములలో ఆరాధిస్తారు.
శ్లోక 16
అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధమ్ |
మన్త్రోఽహమహమేవాజ్యమహమగ్నిరహం హుతమ్ ||౯-౧౬||
అనువాదం
నేనే వైదిక క్రతువును, నేనే యజ్ఞమును, మరియు పూర్వీకులకు సమర్పించే నైవేద్యమును నేనే. నేనే ఔషధ మూలికను, మరియు నేనే వేద మంత్రమును. నేనే (ఆజ్యము) నెయ్యి; నేనే అగ్ని మరియు సమర్పించే కార్యమును. ఈ జగత్తుకి, నేనే తండ్రిని; జగత్తుకి నేనే తల్లిని కూడా, సంరక్షకుడిని, పితామహుడుని నేనే. నేనే పవిత్రమొనర్చేవాడిని, జ్ఞానం యొక్క లక్ష్యమును, పవిత్ర శబ్దము ఓం కారమును నేనే. ఋగ్వేదమును, సామవేదమును, మరియు యజుర్వేదమును నేనే.
శ్లోక 17
పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః |
వేద్యం పవిత్రమోంకార ఋక్సామ యజురేవ చ ||౯-౧౭||
అనువాదం
నేనే వైదిక క్రతువును, నేనే యజ్ఞమును, మరియు పూర్వీకులకు సమర్పించే నైవేద్యమును నేనే. నేనే ఔషధ మూలికను, మరియు నేనే వేద మంత్రమును. నేనే (ఆజ్యము) నెయ్యి; నేనే అగ్ని మరియు సమర్పించే కార్యమును. ఈ జగత్తుకి, నేనే తండ్రిని; జగత్తుకి నేనే తల్లిని కూడా, సంరక్షకుడిని, పితామహుడుని నేనే. నేనే పవిత్రమొనర్చేవాడిని, జ్ఞానం యొక్క లక్ష్యమును, పవిత్ర శబ్దము ఓం కారమును నేనే. ఋగ్వేదమును, సామవేదమును, మరియు యజుర్వేదమును నేనే.
శ్లోక 18
గతిర్భర్తా ప్రభుః సాక్షీ నివాసః శరణం సుహృత్ |
ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్ ||౯-౧౮||
అనువాదం
నేనే సమస్త భూతముల సర్వోన్నత లక్ష్యమును, మరియు నేనే వారి యొక్క నిర్వాహకుడను, స్వామి, సాక్షి, నివాసము, ఆశ్రయము మరియు స్నేహితుడను. నేనే సృష్టికి మూలము, అంతము, మరియు ఆధారము; నేనే శాశ్వతస్థానమును మరియు సనాతన బీజమును.
శ్లోక 19
తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ |
అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున ||౯-౧౯||
అనువాదం
నేను సూర్యుని రూపంలో వేడిమిని ప్రసరిస్తాను, మరియు నేనే వర్షమును ఆపుతాను, కురిపిస్తాను. నేనే అమరత్వమును మరియు నేనే మృత్యు రూపంలో వస్తాను. ఓ అర్జునా, నేనే ఆత్మను, నేనే పదార్థమును కూడా.
శ్లోక 20
త్రైవిద్యా మాం సోమపాః పూతపాపా
యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయన్తే |
తే పుణ్యమాసాద్య సురేన్ద్రలోక-
మశ్నన్తి దివ్యాన్దివి దేవభోగాన్ ||౯-౨౦||
అనువాదం
వేదములలో చెప్పబడిన సకామ కర్మకాండల పట్ల మొగ్గుచూపేవారు, నన్ను యజ్ఞ యాగాదులచే పూజిస్తారు. యజ్ఞ శేషము అయిన సోమరస పానము చేయటం ద్వారా పాపాలన్నీ పోయి, పవిత్రులైన వీరు, స్వర్గ లోకాలకు పోవటానికి ఆశిస్తారు. వారి పుణ్య కర్మల ఫలంగా, వారు స్వర్గాధిపతి అయిన ఇంద్రుని లోకానికి వెళతారు, మరియు, దేవతల విలాసాల భోగాలన్నీ అనుభవిస్తారు.
శ్లోక 21
తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం
క్షీణే పుణ్యే మర్త్యలోకం విశన్తి |
ఏవం త్రయీధర్మమనుప్రపన్నా
గతాగతం కామకామా లభన్తే ||౯-౨౧||
అనువాదం
స్వర్గ లోకము యొక్క విశాలమైన భోగములు అనుభవించుటచే వారి పుణ్య ఫలము అంతా తరిగిపోయిన తరువాత వారు తిరిగి భూలోకానికి వస్తారు. ఈ విధంగా భోగ వస్తు ప్రాప్తికై వైదిక కర్మ కాండలను ఆచరించే వారు భూలోకానికి పదేపదే వచ్చి పోతుంటారు.
శ్లోక 22
అనన్యాశ్చిన్తయన్తో మాం యే జనాః పర్యుపాసతే |
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ||౯-౨౨||
అనువాదం
ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ మరియు నా యందు అనన్య భక్తిలో నిమగ్నమైన వారుంటారు. అలా నా యందే సతతమూ మనస్సు నిలిపిన వారికి, వారికి లేనిదేదో అది సమకూర్చి పెడతాను మరియు వారికి ఉన్నదాన్ని సంరక్షిస్తాను.
శ్లోక 23
యేఽప్యన్యదేవతా భక్తా యజన్తే శ్రద్ధయాన్వితాః |
తేఽపి మామేవ కౌన్తేయ యజన్త్యవిధిపూర్వకమ్ ||౯-౨౩||
అనువాదం
ఓ కుంతీ పుత్రుడా, ఇతర దేవతలను శ్రద్ధతో ఆరాధించే వారు కూడా నన్నే పూజిస్తారు. కానీ, అది వారు తప్పుడు పద్ధతిలో చేసినట్టు.
శ్లోక 24
అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ |
న తు మామభిజానన్తి తత్త్వేనాతశ్చ్యవన్తి తే ||౯-౨౪||
అనువాదం
సమస్త యజ్ఞములకు భోక్తను, ఏకైక స్వామిని నేనే. కానీ, నా ఈ యొక్క పరమేశ్వర తత్త్వమును తెలుసుకొనని వారు తిరిగి పుట్టవలసినదే.
శ్లోక 25
యాన్తి దేవవ్రతా దేవాన్పితౄన్యాన్తి పితృవ్రతాః |
భూతాని యాన్తి భూతేజ్యా యాన్తి మద్యాజినోఽపి మామ్ ||౯-౨౫||
అనువాదం
దేవతలను పూజించే వారు దేవతల యందు జన్మిస్తారు, పితృదేవతలను ఆరాధించేవారు పితృదేవతల దగ్గరకి వెళ్తారు, భూతప్రేతములను అర్చించువారు అలాంటి వాటిల్లో పుడతారు, మరియు నా భక్తులు నన్నే చేరుకుంటారు.
శ్లోక 26
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి |
తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః ||౯-౨౬||
అనువాదం
నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకుగాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని, లేదా నీరైనా గాని సమర్పిస్తే, ఆ స్వచ్ఛమైన మనస్సుగల నా భక్తునిచే ప్రేమతో ఇవ్వబడిన దానిని, నేను సంతోషంగా ఆరగిస్తాను.
శ్లోక 27
యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ |
యత్తపస్యసి కౌన్తేయ తత్కురుష్వ మదర్పణమ్ ||౯-౨౭||
అనువాదం
నీవు ఏ పని చేసినా, నీవు ఏది తిన్నా, నీవు యజ్ఞములో అగ్నికి ఏది సమర్పించినా, నీవు ఏది బహుమతిగా దానం ఇచ్చినా, మరియు ఏ నిష్ఠలను ఆచరించినా, ఓ కుంతీ పుత్రుడా, వాటిని నాకు సమర్పించినట్టుగా చేయుము.
శ్లోక 28
శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబన్ధనైః |
సంన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి ||౯-౨౮||
అనువాదం
అన్ని పనులను నాకే అర్పితం చేయటం ద్వారా, నీవు శుభ-అశుభ ఫలితముల బంధనముల నుండి విముక్తి చేయబడుతావు. సన్యాసం ద్వారా నీ మనస్సు నా యందే లగ్నమై, నీవు విముక్తి చేయబడుతావు మరియు నన్ను చేరుకుంటావు.
శ్లోక 29
సమోఽహం సర్వభూతేషు న మే ద్వేష్యోఽస్తి న ప్రియః |
యే భజన్తి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్ ||౯-౨౯||
అనువాదం
నేను సర్వ ప్రాణుల యందు సమత్వ బుద్ధితో ఉంటాను, నేను ఎవరి పట్ల పక్షపాతంతో కానీ లేదా విరోధ భావం తో కానీ ఉండను. కానీ, ప్రేమతో నన్ను ఆరాధించే భక్తులు నాయందే నివసిస్తారు మరియు నేను వారి యందు నివసిస్తాను.
శ్లోక 30
అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్ |
సాధురేవ స మన్తవ్యః సమ్యగ్వ్యవసితో హి సః ||౯-౩౦||
అనువాదం
పరమ పాపిష్ఠివారు అయినా సరే, నన్ను అనన్య భక్తితో పూజిస్తే, వారిని ధర్మాత్ములుగానే పరిగణించాలి, ఎందుకంటే వారు సరియైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి.
శ్లోక 31
క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాన్తిం నిగచ్ఛతి |
కౌన్తేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి ||౯-౩౧||
అనువాదం
త్వరితగతిన వారు ధర్మాత్ములుగా అవుతారు, మరియు శాశ్వతమైన శాంతిని పొందుతారు. ఓ కుంతీ పుత్రుడా, నా భక్తుడు ఎన్నటికీ నష్టమునకు గురికాడు అని ధైర్యముగా ప్రకటించుము.
శ్లోక 32
మాం హి పార్థ వ్యపాశ్రిత్య యేఽపి స్యుః పాపయోనయః |
స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తేఽపి యాన్తి పరాం గతిమ్ ||౯-౩౨||
అనువాదం
వారి జన్మ, జాతి, కులము ఏదైనా, లింగభేదం లేకుండా, సమాజము అసహ్యించుకునేవారయినా, నన్నుశరణుజొచ్చిన వారంతా పరమ పదమును పొందుతారు.
శ్లోక 33
కిం పునర్బ్రాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా |
అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మామ్ ||౯-౩౩||
అనువాదం
ఇక పుణ్యాత్ములైన రాజులు, మునుల గురించి ఏమి చెప్పాలి? కాబట్టి, తాత్కాలికమైన మరియు సుఖంలేని ఈ ప్రపంచం లోకి వచ్చాక, ఇక, నా యందు భక్తి తో నిమగ్నమవ్వుము.
శ్లోక 34
మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు |
మామేవైష్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణః ||౯-౩౪||
అనువాదం
ఎల్లప్పుడూ నన్నే స్మరించుము, నా పట్ల భక్తితో ఉండుము, నన్ను ఆరాధించుము, మరియు నాకు ప్రణామములు అర్పించుము. నీ మనస్సు మరియు శరీరము నాకు సమర్పించుటచే నీవు నా వద్దకు నిస్సందేహంగా వచ్చెదవు.
కేవలం చదవడం మాత్రమే కాదు—
మీ స్వంత ధ్యాన వీడియోలను సృష్టించండి.
పవిత్ర శ్లోకాలను ప్రపంచంతో పంచుకోవడానికి అందమైన, సినిమాటిక్ వీడియోలుగా మార్చండి. మీ నేపథ్యాన్ని ఎంచుకోండి, మంత్రోచ్ఛారణ ఆడియోను జోడించండి మరియు ఆధునిక ఆకృతిలో గీత వెలుగును ప్రసరింపజేయండి.
ఈ ఫీచర్ల కోసం యాప్ డౌన్‌లోడ్ చేయండి
- అధిక నాణ్యత గల నేపథ్య కళాకృతి
- సమకాలీకరించబడిన సంస్కృత మరియు అర్థ పాఠం
- లీనమయ్యే మంత్రోచ్ఛారణ & సంగీతం
లోతైన అనుభూతిని పొందండి
నిత్య గీత పూర్తి వెర్షన్తో సినిమాటిక్ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించండి. అధిక నాణ్యత గల మంత్రోచ్ఛారణ, ప్రామాణిక అనువాదాలు మరియు మీ అరచేతిలో ఒక ప్రశాంతమైన ధ్యాన అభయారణ్యం.