విశ్వరూపదర్శనయోగ
అథైకాదశోఽధ్యాయః
శ్లోక 1
అర్జున ఉవాచ |
మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్ |
యత్త్వయోక్తం వచస్తేన మోహోఽయం విగతో మమ ||౧౧-౧||
అనువాదం
అర్జునుడు పలికెను: నా మీద దయచే నీవు తెలియపరచిన ఈ యొక్క పరమ రహస్యమైన ఆధ్యాత్మిక జ్ఞానం విన్న తరువాత, నా మోహము ఇప్పుడు తొలగిపోయినది.
శ్లోక 2
భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా |
త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయమ్ ||౧౧-౨||
అనువాదం
సర్వ ప్రాణుల ఉత్పత్తి మరియు అవ్యక్తమైపోవటము విషయము గురించి విస్తారముగా నీ నుండి విన్నాను, ఓ తామర వంటి నేత్రములు కలవాడా, నిత్య శాశ్వతమైన నీ మహాత్మ్యము కూడా విన్నాను.
శ్లోక 3
ఏవమేతద్యథాత్థ త్వమాత్మానం పరమేశ్వర |
ద్రష్టుమిచ్ఛామి తే రూపమైశ్వరం పురుషోత్తమ ||౧౧-౩||
అనువాదం
ఓ ప్రభూ, నీవెవరో నీవే చెప్పినట్టు, నీవు సరిగ్గా అటువంటి దివ్య స్వరూపానివే. ఇప్పుడు నాకు, నీ యొక్క దివ్య విశ్వరూపమును చూడాలనే కోరిక కలుగుతున్నది, ఓ పురుషోత్తమా.
శ్లోక 4
మన్యసే యది తచ్ఛక్యం మయా ద్రష్టుమితి ప్రభో |
యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయమ్ ||౧౧-౪||
అనువాదం
ఓ యోగేశ్వరా, నాకు దాన్ని దర్శించగలిగే శక్తి ఉంది అని నీవు అనుకుంటే, దయచేసి ఆ యొక్క నిత్య శాశ్వతమైన విశ్వ రూపమును నాకు చూపించుము.
శ్లోక 5
శ్రీభగవానువాచ |
పశ్య మే పార్థ రూపాణి శతశోఽథ సహస్రశః |
నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ ||౧౧-౫||
అనువాదం
భగవానుడు పలికెను: వివిధములైన ఆకృతులు, పరిమాణములు, మరియు వర్ణములతో ఉన్న వందల వేల అద్భుతమైన నా యొక్క స్వరూపములను, ఇదిగో తిలకించుము ఓ పార్థ.
శ్లోక 6
పశ్యాదిత్యాన్వసూన్రుద్రానశ్వినౌ మరుతస్తథా |
బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత ||౧౧-౬||
అనువాదం
నాలో పరికించుము ఓ భరత వంశీయుడా, (పన్నెండుగురు) అదితి పుత్రులను, (ఎనిమిది మంది) వసువులను, (పదకొండు) రుద్రులను, (ఇద్దరు) అశ్వినీ కుమారులను, అంతే కాక, (నలభైతొమ్మిది) మరుత్తులు మరియు మరెన్నెన్నో ఇంతకు పూర్వం తెలియపరచబడని అద్భుతములను కూడా చూడుము.
శ్లోక 7
ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరమ్ |
మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్ ద్రష్టుమిచ్ఛసి ||౧౧-౭||
అనువాదం
ఒక్కచోటే కూడి ఉన్న సమస్త చరాచరములను కలిగి ఉన్న జగత్తును, నా విశ్వ రూపము యందే దర్శించుము ఇప్పుడు ఓ అర్జునా. ఇంకా మరేదైనా చూడదలుచుకున్నా వాటన్నిటినీ నా విశ్వ రూపము యందే తిలకించుము.
శ్లోక 8
న తు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా |
దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్ ||౧౧-౮||
అనువాదం
కానీ, నా యొక్క విశ్వ రూపమును నీ ప్రాకృతిక కళ్ళతో చూడలేవు. కాబట్టి, నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. నా యొక్క మహాద్భుత వైభవమును దర్శించుము.
శ్లోక 9
సఞ్జయ ఉవాచ |
ఏవముక్త్వా తతో రాజన్మహాయోగేశ్వరో హరిః |
దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరమ్ ||౧౧-౯||
అనువాదం
సంజయుడు పలికెను: ఓ మహారాజా, ఇట్లు పలికిన పిదప, ఆ యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడు, తన యొక్క దివ్యమైన మరియు వైభవోపేతమైన రూపమును అర్జునుడికి చూపెను.
శ్లోక 10 మరియు 11
అనేకవక్త్రనయనమనేకాద్భుతదర్శనమ్ |
అనేకదివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధమ్ ||౧౧-౧౦||
దివ్యమాల్యామ్బరధరం దివ్యగన్ధానులేపనమ్ |
సర్వాశ్చర్యమయం దేవమనన్తం విశ్వతోముఖమ్ ||౧౧-౧౧||
అనువాదం
ఆ యొక్క విశ్వరూపములో, అర్జునుడు అనంతమైన ముఖములు మరియు కనులను దర్శించాడు. అవి ఎన్నెన్నో దివ్యమైన ఆభరణములను మరియు అనేక రకాల దివ్య ఆయుధములను కలిగి ఉన్నాయి. ఆ స్వరూపము తన శరీరంపై అనేక మాలలను కలిగి ఉంది మరియు దివ్య సుగంధ పరిమళభూరితమై గుబాళిస్తున్నది. మహాద్భుతమైన అనంతమైన ఈశ్వరునిగా సర్వత్రా తన ముఖముతో తనను తాను వ్యక్తపరుచుకున్నాడు.
శ్లోక 12
దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థితా |
యది భాః సదృశీ సా స్యాద్భాసస్తస్య మహాత్మనః ||౧౧-౧౨||
అనువాదం
ఆకాశములో వెయ్యి మంది సూర్యులు ఒకే సమయంలో ప్రకాశించినా, ఆ మహోన్నత రూపము యొక్క తేజస్సుకు సాటి రావు.
శ్లోక 13
తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా |
అపశ్యద్దేవదేవస్య శరీరే పాణ్డవస్తదా ||౧౧-౧౩||
అనువాదం
అక్కడ, ఆ దేవదేవుని శరీరము యందు, సమస్త బ్రహ్మాండములన్నీ ఒక్క చోటే ఉన్నట్టు అర్జునుడు దర్శించాడు.
శ్లోక 14
తతః స విస్మయావిష్టో హృష్టరోమా ధనఞ్జయః |
ప్రణమ్య శిరసా దేవం కృతాఞ్జలిరభాషత ||౧౧-౧౪||
అనువాదం
అప్పుడు, పరామాశ్చర్యమునకు లోనయ్యి, రోమములు నిక్కబోడుచుకున్నవాడైన అర్జునుడు, చేతులు జోడించి తలవంచి నమస్కరిస్తూ, భగవంతుడుని ఈ విధంగా స్తుతించాడు.
శ్లోక 15
అర్జున ఉవాచ |
పశ్యామి దేవాంస్తవ దేవ దేహే
సర్వాంస్తథా భూతవిశేషసఙ్ఘాన్ |
బ్రహ్మాణమీశం కమలాసనస్థ-
మృషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ ||౧౧-౧౫||
అనువాదం
అర్జునుడు ఇలా చెప్పెను, ఓ శ్రీ కృష్ణా, నీ దేహం యందు నేను సకల దేవతలనూ, ఎన్నెనో ప్రాణికోటి సమూహములను దర్శిస్తున్నాను. కమలము యందు కూర్చుని ఉన్న బ్రహ్మ దేవుడిని, శివుడిని, అందరు ఋషులను, మరియు దివ్య సర్పములను చూస్తున్నాను.
శ్లోక 16
అనేకబాహూదరవక్త్రనేత్రం
పశ్యామి త్వాం సర్వతోఽనన్తరూపమ్ |
నాన్తం న మధ్యం న పునస్తవాదిం
పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప ||౧౧-౧౬||
అనువాదం
అసంఖ్యాకమైన చేతులతో, ఉదరములతో, ముఖములతో, మరియు కళ్ళతో ఉన్న నీ యొక్క అనంతమైన రూపములను అన్ని దిశలలో చూస్తున్నాను. ఓ విశ్వేశ్వరా, విశ్వమే నీ యొక్క స్వరూపముగా కలవాడా, నీ యందు ఎటువంటి ఆదిమధ్యాంతరములు చూడలేకున్నాను.
శ్లోక 17
కిరీటినం గదినం చక్రిణం చ
తేజోరాశిం సర్వతో దీప్తిమన్తమ్ |
పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమన్తాద్
దీప్తానలార్కద్యుతిమప్రమేయమ్ ||౧౧-౧౭||
అనువాదం
కిరీటముతో, చక్ర-గద ఆయుధములు కలిగి సర్వత్రా ప్రకాశించుచున్న నీ యొక్క ఆశ్చర్యచకిత స్వరూపమును దర్శిస్తున్నాను. సూర్యునిలా అన్ని దిశలలో అగ్నిని విరజిమ్ముతున్న నీ తేజస్సుచే నిన్ను చూడటానికి కష్టతరంగా ఉన్నది.
శ్లోక 18
త్వమక్షరం పరమం వేదితవ్యం
త్వమస్య విశ్వస్య పరం నిధానమ్ |
త్వమవ్యయః శాశ్వతధర్మగోప్తా
సనాతనస్త్వం పురుషో మతో మే ||౧౧-౧౮||
అనువాదం
నీవే అనశ్వరమైన పరమేశ్వరుడవు అని, వేదములచే ప్రతిపాదింపబడిన పరమ సత్యము అని తెలుసుకున్నాను. నీవే సమస్త సృష్టికి ఆధారము; నీవే సనాతన ధర్మమునకు నిత్య రక్షకుడవు; నీవే నిత్య శాశ్వతమైన పరమ భగవంతుడవు.
శ్లోక 19
అనాదిమధ్యాన్తమనన్తవీర్య-
మనన్తబాహుం శశిసూర్యనేత్రమ్ |
పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం
స్వతేజసా విశ్వమిదం తపన్తమ్ ||౧౧-౧౯||
అనువాదం
నీవు ఆది-మధ్య-అంతము లేనివాడవు; నీ శక్తి అపరిమితమైనది. నీకు అనంతమైన బాహువులు కలవు; సూర్యచంద్రులు నీ నేత్రముల వంటివి మరియు అగ్నినీ నోరు వంటిది. సమస్త సృష్టిని నీ తేజస్సుచే వెచ్చగా ఉత్తేజ పరుచుతున్నటువంటి నిన్ను, నేను దర్శిస్తున్నాను.
శ్లోక 20
ద్యావాపృథివ్యోరిదమన్తరం హి
వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః |
దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం
లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్ ||౧౧-౨౦||
అనువాదం
దివి నుండి భువి వరకు గల మధ్య ప్రదేశమంతా మరియు అన్ని దిశలలో కూడా నీవే వ్యాపించి ఉన్నావు. ఓ మహత్మా, నీ యొక్క అద్భుతమైన మరియు భయంకరమైన స్వరూపమును దర్శిస్తూ, ముల్లోకములూ భయంతో కంపించిపోవటం నేను గమనిస్తున్నాను.
శ్లోక 21
అమీ హి త్వాం సురసఙ్ఘా విశన్తి
కేచిద్భీతాః ప్రాఞ్జలయో గృణన్తి |
స్వస్తీత్యుక్త్వా మహర్షిసిద్ధసఙ్ఘాః
స్తువన్తి త్వాం స్తుతిభిః పుష్కలాభిః ||౧౧-౨౧||
అనువాదం
దేవతలందరూ నీలో ప్రవేశిస్తూ నీ యొక్క ఆశ్రయం పొందుతున్నారు. కొందరు భీతులై చేతులు జోడించి నిన్ను కీర్తిస్తున్నారు. మహర్షులు, సిద్ధులు మంగళకరమైన స్తోత్రములతో, కీర్తనలతో నిన్ను స్తుతిస్తున్నారు.
శ్లోక 22
రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యా
విశ్వేఽశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ |
గన్ధర్వయక్షాసురసిద్ధసఙ్ఘా
వీక్షన్తే త్వాం విస్మితాశ్చైవ సర్వే ||౧౧-౨౨||
అనువాదం
రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్వినీ కుమారులు, మరుత్తులు, పితరులు, గంధర్వులు, యక్షులు, అసురులు, మరియు సిద్ధులు అందరూ కూడా సంభ్రమాశ్చర్యములతో నిన్నే తిలకిస్తున్నారు.
శ్లోక 23
రూపం మహత్తే బహువక్త్రనేత్రం
మహాబాహో బహుబాహూరుపాదమ్ |
బహూదరం బహుదంష్ట్రాకరాలం
దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహమ్ ||౧౧-౨౩||
అనువాదం
ఓ మహాప్రభూ, ఎన్నెన్నో నోర్లు, కళ్ళు, చేతులు, ఊరువులు, కాళ్ళు, ఉదరములు, మరియు భయంకరమైన పళ్ళతో ఉన్న నీ మహాద్భుతమైన స్వరూపము పట్ల పూజ్యభావంతో, సమస్త లోకములు మరియు నేను కూడా భయకంపితమైఉన్నాము.
శ్లోక 24
నభఃస్పృశం దీప్తమనేకవర్ణం
వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్ |
దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాన్తరాత్మా
ధృతిం న విన్దామి శమం చ విష్ణో ||౧౧-౨౪||
అనువాదం
హే విష్ణో! ఆకాశమును తాకుతూ, ఎన్నెన్నో వర్ణములతో ప్రకాశిస్తూ, పెద్దగా తెరిచిఉన్న నోర్లతో, విశాలమైన అగ్ని గుండముల వంటి నీ కన్నులతో ఉన్న నీ స్వరూపమును చూస్తున్న నాకు, భయముతో గుండె అదిరిపొతున్నది. నేను ధైర్యమును మరియు మానసిక ప్రశాంతతను కోల్పోయాను.
శ్లోక 25
దంష్ట్రాకరాలాని చ తే ముఖాని
దృష్ట్వైవ కాలానలసన్నిభాని |
దిశో న జానే న లభే చ శర్మ
ప్రసీద దేవేశ జగన్నివాస ||౧౧-౨౫||
అనువాదం
ప్రళయ కాల సమయంలో కనిపించేటటువంటి ప్రజ్వలించే అగ్నిలా, భయంకరమైన దంతములతో ఉన్న ఎన్నో నోర్లతో ఉన్న నిన్ను, చూసిన పిదప, నేను ఎక్కడున్నానో మరియు ఎక్కడికి పోవాలో మర్చిపోతున్నాను. ఓ దేవదేవా, నీవే జగత్తుకి ఆశ్రయము; దయచేసి నామీద కృప చూపుము.
శ్లోక 26 మరియు 27
అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః
సర్వే సహైవావనిపాలసఙ్ఘైః |
భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ
సహాస్మదీయైరపి యోధముఖ్యైః ||౧౧-౨౬||
వక్త్రాణి తే త్వరమాణా విశన్తి
దంష్ట్రాకరాలాని భయానకాని |
కేచిద్విలగ్నా దశనాన్తరేషు
సన్దృశ్యన్తే చూర్ణితైరుత్తమాఙ్గైః ||౧౧-౨౭||
అనువాదం
ధృతరాష్ట్రుడి కుమారులందరూ, వారి సహచర రాజులతో సహా, భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు ఇంకా మన పక్షమున ఉన్న యోధులు కూడా తలకిందులుగా నీ భయంకరమైన నోళ్లలోనికి త్వరితగతిన ప్రవేశిస్తున్నారు. కొందరి తలలు నీ భీకరమైన పళ్ళ మధ్యలో చితికిపోయినట్టు నేను చూస్తున్నాను.
శ్లోక 28
యథా నదీనాం బహవోఽమ్బువేగాః
సముద్రమేవాభిముఖా ద్రవన్తి |
తథా తవామీ నరలోకవీరా
విశన్తి వక్త్రాణ్యభివిజ్వలన్తి ||౧౧-౨౮||
అనువాదం
ఎన్నో నదుల నీటి తరంగాలు సముద్రములోనికి వేగంగా పారుతూ వచ్చి కలిసి పోయినట్లు, ఈ గొప్పగొప్ప యోధులు అందరూ నీ ప్రజ్వలించే నోర్ల లోనికి ప్రవేశిస్తున్నారు. అగ్గిపురుగులు ఎలాగైతే అత్యంత వేగముతో వచ్చి మంటలో పడి నాశనం అయిపొతాయో, ఈ యొక్క సైన్యములు కూడా నీ నోర్లలోనికి ప్రవేశిస్తున్నారు.
శ్లోక 29
యథా ప్రదీప్తం జ్వలనం పతఙ్గా
విశన్తి నాశాయ సమృద్ధవేగాః |
తథైవ నాశాయ విశన్తి లోకాస్-
తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః ||౧౧-౨౯||
అనువాదం
ఎన్నో నదుల నీటి తరంగాలు సముద్రములోనికి వేగంగా పారుతూ వచ్చి కలిసి పోయినట్లు, ఈ గొప్పగొప్ప యోధులు అందరూ నీ ప్రజ్వలించే నోర్ల లోనికి ప్రవేశిస్తున్నారు. అగ్గిపురుగులు ఎలాగైతే అత్యంత వేగముతో వచ్చి మంటలో పడి నాశనం అయిపొతాయో, ఈ యొక్క సైన్యములు కూడా నీ నోర్లలోనికి ప్రవేశిస్తున్నారు.
శ్లోక 30
లేలిహ్యసే గ్రసమానః సమన్తాల్-
లోకాన్సమగ్రాన్వదనైర్జ్వలద్భిః |
తేజోభిరాపూర్య జగత్సమగ్రం
భాసస్తవోగ్రాః ప్రతపన్తి విష్ణో ||౧౧-౩౦||
అనువాదం
నీ యొక్క భయంకరమైన నాలుకలతో అన్ని దిక్కులా ఎన్నెన్నో ప్రాణులను గ్రసించివేస్తూ నీ యొక్క ప్రజ్వలిత నోళ్ళతో వారిని కబళించి వేస్తున్నావు. హే విష్ణో! నీవు సమస్త జగత్తును నీయొక్క భయంకరమైన, సర్వ వ్యాప్తమైన తేజో కిరణాలతో తపింపచేయుచున్నావు.
శ్లోక 31
ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో
నమోఽస్తు తే దేవవర ప్రసీద |
విజ్ఞాతుమిచ్ఛామి భవన్తమాద్యం
న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్ ||౧౧-౩౧||
అనువాదం
నీవెవరో తెలియచేయుము ఓ భయంకర రూపము కలవాడా. ఓ దేవదేవా, నీ ముందు ప్రణమిల్లుతున్నాను; దయచేసి నాపై కృప చూపుము. సమస్త సృష్టికీ ముందే ఉన్న నీ గురించి, నీవెవరో తెలుసుకోగోరుతున్నాను, ఎందుకంటే నీ స్వభావము మరియు వ్యవహారమును నేను అర్థం చేసుకోలేకున్నాను.
శ్లోక 32
శ్రీభగవానువాచ |
కాలోఽస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో
లోకాన్సమాహర్తుమిహ ప్రవృత్తః |
ఋతేఽపి త్వాం న భవిష్యన్తి సర్వే
యేఽవస్థితాః ప్రత్యనీకేషు యోధాః ||౧౧-౩౨||
అనువాదం
భగవానుడు పలికెను: నేనే మహాకాలమును, సమస్త లోకములను సర్వనాశనము చేసే మూలకారణమును. నీ యొక్క ప్రమేయం లేకున్ననూ, ప్రతిపక్షమున నిలిచి ఉన్న యోధులు ఎవ్వరూ మిగలరు (నశిస్తారు).
శ్లోక 33
తస్మాత్త్వముత్తిష్ఠ యశో లభస్వ
జిత్వా శత్రూన్ భుఙ్క్ష్వ రాజ్యం సమృద్ధమ్ |
మయైవైతే నిహతాః పూర్వమేవ
నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ ||౧౧-౩౩||
అనువాదం
కాబట్టి, ఓ సవ్యసాచీ, లెమ్ము, కీర్తిని పొందుము! శత్రువులను జయించుము మరియు సర్వసంపదలతో ఉన్న సామ్రాజ్యమును అనుభవించుము. ఈ యోధులు ఇంతకు పూర్వమే నా చే సంహరింపబడి ఉన్నారు, కేవలం నా పనిలో ఒక పనిముట్టుగా ఉండగలవు.
శ్లోక 34
ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ
కర్ణం తథాన్యానపి యోధవీరాన్ |
మయా హతాంస్త్వం జహి మా వ్యథిష్ఠా
యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్ ||౧౧-౩౪||
అనువాదం
ద్రోణాచార్యుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు, ఇంకా ఇంతర వీరయోధులు అందరూ నాచే ఇప్పటికే సంహరింపబడ్డారు. కాబట్టి, వ్యాకుల పడకుండా వారిని అంతం చేయుము. కేవలం పోరాడుము, నీవు ఈ యుద్ధములో శత్రువులపై విజయం సాధిస్తావు.
శ్లోక 35
సఞ్జయ ఉవాచ |
ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య
కృతాఞ్జలిర్వేపమానః కిరీటీ |
నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం
సగద్గదం భీతభీతః ప్రణమ్య ||౧౧-౩౫||
అనువాదం
సంజయుడు పలికెను: కేశవుడు పలికిన మాటలు విన్న తరువాత అర్జునుడు భీతితో వణికిపోయాడు. చేతులు జోడించి, శ్రీ కృష్ణుడి ఎదుట వంగి నమస్కరిస్తూ భయము ఆవరించి గద్గద స్వరముతో ఇలా పలికెను.
శ్లోక 36
అర్జున ఉవాచ |
స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా
జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ |
రక్షాంసి భీతాని దిశో ద్రవన్తి
సర్వే నమస్యన్తి చ సిద్ధసఙ్ఘాః ||౧౧-౩౬||
అనువాదం
అర్జునుడు పలికెను: హే హృషీకేశా (ఇంద్రియములకు అధిపతి), సమస్త జగత్తు నిన్ను కీర్తించుచూ ఆనందహర్షములతో ఉన్నది, మరియు నీ పట్ల ప్రేమతో నిండిపొయినది. ఇది సముచితమే. రాక్షసులు భయముతో భీతిల్లి నీ నుండి దూరముగా అన్ని దిక్కులలో పారిపోవుతున్నారు మరియు ఎంతో మంది సిద్ధగణములు నీకు ప్రణమిల్లుతున్నారు.
శ్లోక 37
కస్మాచ్చ తే న నమేరన్మహాత్మన్
గరీయసే బ్రహ్మణోఽప్యాదికర్త్రే |
అనన్త దేవేశ జగన్నివాస
త్వమక్షరం సదసత్తత్పరం యత్ ||౧౧-౩౭||
అనువాదం
ఓ మహాత్మా, మూల సృష్టికర్తయైన బ్రహ్మదేవుని కంటే ఉన్నతమైన వారు కూడా నీ ముందు ఎందుకు ప్రణమిల్లకూడదు? ఓ అనంతుడా, ఓ దేవతల ప్రభూ, ఓ జగత్తుకి ఆశ్రయమైన వాడా, నీవు వ్యక్త-అవ్యక్తములకూ అతీతమైన అక్షరుడవు.
శ్లోక 38
త్వమాదిదేవః పురుషః పురాణస్-
త్వమస్య విశ్వస్య పరం నిధానమ్ |
వేత్తాసి వేద్యం చ పరం చ ధామ
త్వయా తతం విశ్వమనన్తరూప ||౧౧-౩౮||
అనువాదం
నీవే సనాతనమైన భగవంతుడవు మరియు ఆది దేవుడవు; నీవే విశ్వమంతటికీ ఉన్న ఒకేఒక్క ఆధారము, ఆశ్రయము. నీవు సర్వజ్ఞుడవు మరియు తెలుసుకోబడవలసిన వాడవు. నీవే పరంధామము. ఓ అనంతరూపా, నీవే సమస్త జగత్తుయందు వ్యాపించి ఉన్నవాడవు.
శ్లోక 39
వాయుర్యమోఽగ్నిర్వరుణః శశాఙ్కః
ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ |
నమో నమస్తేఽస్తు సహస్రకృత్వః
పునశ్చ భూయోఽపి నమో నమస్తే ||౧౧-౩౯||
అనువాదం
నీవే వాయుదేవుడవు, యమధర్మరాజువు, అగ్ని దేవుడవు, వరుణ దేవుడవు మరియు చంద్రుడవు. నీవే సృష్టికర్త బ్రహ్మవు మరియు సర్వ భూతముల ప్ర-పితామహుడవు. నీకు నేను వేలసార్లు నమస్కరిస్తున్నాను, మరల మరల నమస్కరిస్తున్నాను!
శ్లోక 40
నమః పురస్తాదథ పృష్ఠతస్తే
నమోఽస్తు తే సర్వత ఏవ సర్వ |
అనన్తవీర్యామితవిక్రమస్త్వం
సర్వం సమాప్నోషి తతోఽసి సర్వః ||౧౧-౪౦||
అనువాదం
అనంతమైన శక్తిసామర్థ్యములు కల ప్రభూ, నీకు ఎదురుగా ఉండి మరియు వెనుక నుండి కూడా నమస్కరిస్తున్నాను, నిజానికి అన్ని వైపులనుండీ నమస్కరిస్తున్నాను! నీవు అనంతమైన సామర్థ్యము, పరాక్రమము కలిగినవాడివై అన్నింటా వ్యాపించి ఉన్నావు, అందుకే సమస్తమూ నీ స్వరూపమే.
శ్లోక 41 మరియు 42
సఖేతి మత్వా ప్రసభం యదుక్తం
హే కృష్ణ హే యాదవ హే సఖేతి |
అజానతా మహిమానం తవేదం
మయా ప్రమాదాత్ప్రణయేన వాపి ||౧౧-౪౧||
యచ్చావహాసార్థమసత్కృతోఽసి
విహారశయ్యాసనభోజనేషు |
ఏకోఽథవాప్యచ్యుత తత్సమక్షం
తత్క్షామయే త్వామహమప్రమేయమ్ ||౧౧-౪౨||
అనువాదం
నీవు నా సఖుడవు (మిత్రుడవు) అనుకుంటూ, అతి చనువుతో నిన్ను, ‘ఓ కృష్ణా’, ‘ఓ యాదవా’, ‘ఓ నా ప్రియ మిత్రమా’ అని పిలిచాను. నీ మహత్త్వము తెలియక, నిర్లక్ష్యముగా, అతి చనువుతో ప్రవర్తించాను. ఆడుకుంటున్నప్పుడు కానీ, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, భోజనం చేస్తున్నప్పుడు కానీ, ఏకాంతముగా ఉన్నప్పుడు కానీ లేదా ఇతరుల సమక్షంలో కానీ, ఒకవేళ నీ పట్ల హాస్యానికైనా నేను అమర్యాదతో ప్రవర్తించినట్లయితే — వాటన్నిటికీ నేను క్షమాపణలను వేడుకుంటున్నాను.
శ్లోక 43
పితాసి లోకస్య చరాచరస్య
త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ |
న త్వత్సమోఽస్త్యభ్యధికః కుతోఽన్యో
లోకత్రయేఽప్యప్రతిమప్రభావ ||౧౧-౪౩||
అనువాదం
నీవే సమస్త విశ్వమునకు, చరాచర ప్రాణులన్నిటికీ తండ్రివి. నీవే సర్వశ్రేష్ఠమైన ఆరాధ్య యోగ్యుడవు మరియు పరమ ఆధ్యాత్మిక గురుడవు. ఓ అసమానమైన శక్తి కలిగినవాడా, ముల్లోకాలలో నీకు సమానులే లేనప్పుడు, నిన్ను మించిన వారు మాత్రం ఎవరుంటారు?
శ్లోక 44
తస్మాత్ప్రణమ్య ప్రణిధాయ కాయం
ప్రసాదయే త్వామహమీశమీడ్యమ్ |
పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః
ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుమ్ ||౧౧-౪౪||
అనువాదం
అందుకే ఓ ప్రభూ, నీకు ప్రణమిల్లుతూ సాష్టాంగ ప్రణామం అర్పిస్తూ, నీ కృప వేడుకుంటున్నాను. ఒక తండ్రి కొడుకుని సహించినట్టుగా, ఒక మిత్రుడు తన మిత్రుడిని క్షమించినట్టుగా, మరియు ప్రేమించినవారిని ప్రేమికులు మన్నించినట్టుగా, దయచేసి నా అపరాధములను మన్నింపుము.
శ్లోక 45
అదృష్టపూర్వం హృషితోఽస్మి దృష్ట్వా
భయేన చ ప్రవ్యథితం మనో మే |
తదేవ మే దర్శయ దేవ రూపం
ప్రసీద దేవేశ జగన్నివాస ||౧౧-౪౫||
అనువాదం
ఇంతకు మునుపెన్నడూ చూడని నీ యొక్క విశ్వ రూపమును చూసిన పిదప, నేను పరమానందమును అనుభవిస్తున్నాను. అయినా సరే, నా మనస్సు భయముతో వణుకుచున్నది. దయచేసి నాపై కృప చేయుము మరియు తిరిగి మరల నీ యొక్క ప్రసన్నమైన స్వరూపమును చూపుము, ఓ దేవదేవా, ఓ జగత్తుకు ఆశ్రయమును ఇచ్చేవాడా.
శ్లోక 46
కిరీటినం గదినం చక్రహస్తం
ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ |
తేనైవ రూపేణ చతుర్భుజేన
సహస్రబాహో భవ విశ్వమూర్తే ||౧౧-౪౬||
అనువాదం
ఓ వెయ్యి చేతులు కలవాడా, నీవే మూర్తీభవించిన జగత్తుయైనా, కిరీటము ధరించి, చక్రమును, గదను కలిగి ఉన్న నీ యొక్క చతుర్భుజ రూపములో నిన్ను చూడగోరుతున్నాను.
శ్లోక 47
శ్రీభగవానువాచ |
మయా ప్రసన్నేన తవార్జునేదం
రూపం పరం దర్శితమాత్మయోగాత్ |
తేజోమయం విశ్వమనన్తమాద్యం
యన్మే త్వదన్యేన న దృష్టపూర్వమ్ ||౧౧-౪౭||
అనువాదం
శ్రీ భగవానుడు పలికెను: అర్జునా, నీ చేత ప్రసన్నుడనై, నా యోగమాయా శక్తి ద్వారా, నా యొక్క తేజోవంతమయిన, అనంతమైన, మరియు సనాతనమైన మూల విశ్వ రూపమును నేను నీకు చూపించితిని. నీ కంటే ముందు ఈ రూపమును ఎవ్వరూ చూడలేదు.
శ్లోక 48
న వేదయజ్ఞాధ్యయనైర్న దానైర్-
న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః |
ఏవంరూపః శక్య అహం నృలోకే
ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర ||౧౧-౪౮||
అనువాదం
వేదముల అధ్యయనం వలన కానీ, యజ్ఞయాగాదులు చేయటం వలన కానీ, తపస్సులు, దానాల వలన కానీ, తీవ్ర నియమ-నిష్ఠలను ఆచరించటం వలన కానీ, ఏ మానవుడు కూడా నీవు చూసిన దాన్ని ఇప్పటివరకు చూడలేదు, ఓ కురు యోధ శ్రేష్ఠుడా.
శ్లోక 49
మా తే వ్యథా మా చ విమూఢభావో
దృష్ట్వా రూపం ఘోరమీదృఙ్మమేదమ్ |
వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం
తదేవ మే రూపమిదం ప్రపశ్య ||౧౧-౪౯||
అనువాదం
నా యొక్క ఈ భయంకర రూపమును చూసి భయపడవద్దు, భ్రాంతికి లోను కావద్దు. భయరహితముగా ప్రసన్నచిత్తముతో మరొకసారి నా యొక్క స్వరూపమును చూడుము.
శ్లోక 50
సఞ్జయ ఉవాచ |
ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా
స్వకం రూపం దర్శయామాస భూయః |
ఆశ్వాసయామాస చ భీతమేనం
భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా ||౧౧-౫౦||
అనువాదం
సంజయుడు ఇలా పలికెను: ఈ విధముగా పలికిన పిదప దయాళువైన వసుదేవుని తనయుడు తన యొక్క (చతుర్భుజ) సాకార రూపమును మరల చూపించెను. తదుపరి, సౌమ్యమైన (రెండు భుజముల) రూపమును స్వీకరించి, భీతిల్లిన అర్జునుడిని మరింత శాంతింపచేసెను.
శ్లోక 51
అర్జున ఉవాచ |
దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన |
ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః ||౧౧-౫౧||
అనువాదం
అర్జునుడు ఇలా అన్నాడు: ఓ శ్రీ కృష్ణా, నీ యొక్క సౌమ్యమైన (రెండు చేతుల) మనుష్య రూపము చూసి, నా ప్రశాంతతను మళ్ళీ పొందాను మరియు నా మనస్సు సహజ స్థితికి వచ్చినది.
శ్లోక 52
శ్రీభగవానువాచ |
సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ |
దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాఙ్క్షిణః ||౧౧-౫౨||
అనువాదం
శ్రీ భగవానుడు పలికెను: నీవు చూసే నా ఈ యొక్క రూపము దర్శనం పొందటం ఎంతో దుర్లభమయినది. దేవతలు కూడా దీనిని చూడాలని ఆకాంక్షిస్తుంటారు. వేదాధ్యయనము వలన కానీ, తపస్సులవలన కానీ, దానధర్మాల వలన కానీ, లేదా యజ్ఞముల వలన కానీ, నేను, నీవు ఇందాక చూసినట్టుగా కనిపించను.
శ్లోక 53
నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా |
శక్య ఏవంవిధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా ||౧౧-౫౩||
అనువాదం
శ్రీ భగవానుడు పలికెను: నీవు చూసే నా ఈ యొక్క రూపము దర్శనం పొందటం ఎంతో దుర్లభమయినది. దేవతలు కూడా దీనిని చూడాలని ఆకాంక్షిస్తుంటారు. వేదాధ్యయనము వలన కానీ, తపస్సులవలన కానీ, దానధర్మాల వలన కానీ, లేదా యజ్ఞముల వలన కానీ, నేను, నీవు ఇందాక చూసినట్టుగా కనిపించను.
శ్లోక 54
భక్త్యా త్వనన్యయా శక్య అహమేవంవిధోఽర్జున |
జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్టుం చ పరన్తప ||౧౧-౫౪||
అనువాదం
ఓ అర్జునా, అనన్యమైన భక్తి చేత మాత్రమే నేను నీ ముందే నిల్చుని ఉన్న నన్నుగా యదార్థముగా తెలుసుకోబడుతాను. ఓ పరంతపా, అందువలన నా దివ్య దృష్టిని పొందిన పిదప నాతో ఏకీభావ స్థితిని పొందవచ్చు.
శ్లోక 55
మత్కర్మకృన్మత్పరమో మద్భక్తః సఙ్గవర్జితః |
నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాణ్డవ ||౧౧-౫౫||
అనువాదం
ఎవరైతే అన్ని కర్మలనూ నా కొరకే చేస్తారో, నా పైనే ఆధారపడతారో మరియు నా పట్ల భక్తితో ఉంటారో, మమకారాసక్తులు లేకుండా ఉంటారో, సర్వ భూతముల పట్ల విరోధభావము లేకుండా ఉంటారో, అటువంటి భక్తులు తప్పకుండా నన్నే చేరుకుంటారు.
కేవలం చదవడం మాత్రమే కాదు—
మీ స్వంత ధ్యాన వీడియోలను సృష్టించండి.
పవిత్ర శ్లోకాలను ప్రపంచంతో పంచుకోవడానికి అందమైన, సినిమాటిక్ వీడియోలుగా మార్చండి. మీ నేపథ్యాన్ని ఎంచుకోండి, మంత్రోచ్ఛారణ ఆడియోను జోడించండి మరియు ఆధునిక ఆకృతిలో గీత వెలుగును ప్రసరింపజేయండి.
ఈ ఫీచర్ల కోసం యాప్ డౌన్‌లోడ్ చేయండి
- అధిక నాణ్యత గల నేపథ్య కళాకృతి
- సమకాలీకరించబడిన సంస్కృత మరియు అర్థ పాఠం
- లీనమయ్యే మంత్రోచ్ఛారణ & సంగీతం
లోతైన అనుభూతిని పొందండి
నిత్య గీత పూర్తి వెర్షన్తో సినిమాటిక్ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించండి. అధిక నాణ్యత గల మంత్రోచ్ఛారణ, ప్రామాణిక అనువాదాలు మరియు మీ అరచేతిలో ఒక ప్రశాంతమైన ధ్యాన అభయారణ్యం.