భక్తియోగ
అథ ద్వాదశోఽధ్యాయ
శ్లోక 1
అర్జున ఉవాచ |
ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే |
యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః ||౧౨-౧||
అనువాదం
అర్జునుడు ఇలా అడిగెను: నీ యొక్క సాకార రూపము పట్ల స్థిరముగా భక్తితో ఉండేవారు మరియు నిరాకార బ్రహ్మన్ ను ఉపాసించే వారు – వీరిలో, యోగములో ఎవరు ఎక్కువ శ్రేష్ఠులు అని నీవు పరిగణిస్తావు?
శ్లోక 2
శ్రీభగవానువాచ |
మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే |
శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః ||౧౨-౨||
అనువాదం
భగవానుడు పలికెను: నా పైనే తమ మనస్సులను లగ్నం చేసి మరియు సతతమూ నా పట్ల దృఢ విశ్వాసంతో భక్తిలో నిమగ్నమైన వారు అత్యుత్తమ యోగులని నేను పరిగణిస్తాను.
శ్లోక 3 మరియు 4
యే త్వక్షరమనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే |
సర్వత్రగమచిన్త్యఞ్చ కూటస్థమచలన్ధ్రువమ్ ||౧౨-౩||
సన్నియమ్యేన్ద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః |
తే ప్రాప్నువన్తి మామేవ సర్వభూతహితే రతాః ||౧౨-౪||
అనువాదం
నాశరహితుడూ, అనిర్వచనీయమైన వాడు, అవ్యక్తమూ, సర్వవ్యాపి, మనోబుద్ధులకు అతీతుడు, మార్పు లేనివాడు, నిత్యశాశ్వతుడూ, మరియు నిశ్చలమైన వాడునూ - అయిన పరమ సత్యము యొక్క నిరాకార తత్త్వాన్ని - ఇంద్రియములను నిగ్రహించి, సర్వత్రా సమబుద్ధితో ఉంటూ, సర్వభూతముల సంక్షేమం కోసం నిమగ్నమై ఉంటూ - ఆరాధించేవారు కూడా నన్ను పొందుతారు.
శ్లోక 5
క్లేశోఽధికతరస్తేషామవ్యక్తాసక్తచేతసామ్ |
అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే ||౧౨-౫||
అనువాదం
మనస్సు యందు అవ్యక్తము పట్ల ఆసక్తి ఉన్నవారికి, సిద్ధి పథము చాలా కష్టములతో కూడుకున్నది. అవ్యక్తమును ఆరాధించటం అనేది శరీరబద్ధులైన జీవులకు చాలా కష్టతరమైనది.
శ్లోక 6 మరియు 7
యే తు సర్వాణి కర్మాణి మయి సంన్యస్య మత్పరః |
అనన్యేనైవ యోగేన మాం ధ్యాయన్త ఉపాసతే ||౧౨-౬||
తేషామహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్ |
భవామి నచిరాత్పార్థ మయ్యావేశితచేతసామ్ ||౧౨-౭||
అనువాదం
కానీ, తాము చేసే కర్మలన్నింటినీ నాకే సమర్పిస్తూ, నన్నే పరమ లక్ష్యముగా భావిస్తూ, నన్నే ఆరాధిస్తూ మరియు అనన్య భక్తితో నా మీదే ధ్యానం చేసే వారిని, ఓ పార్థా, నేను వారిని శీఘ్రముగానే ఈ మృత్యుసంసారసాగరము నుండి విముక్తి చేస్తాను, ఏలనన వారి అంతఃకరణ నా యందే ఏకమైపోయి ఉంటుంది.
శ్లోక 8
మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ |
నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః ||౧౨-౮||
అనువాదం
నీ మనస్సుని నామీదే లగ్నం చేయుము మరియు నీ బుద్ధిని నాకు అర్పించుము. ఆ తరువాత, నీవు సర్వదా నాలోనే నివసిస్తావు. దీనిపై ఎలాంటి సంశయము వద్దు.
శ్లోక 9
అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్ |
అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనఞ్జయ ||౧౨-౯||
అనువాదం
ఒకవేళ నీవు మనస్సును నా యందే నిశ్చలముగా లగ్నం చేయలేకపోతే, ఓ అర్జునా, మనస్సును నిరంతరం ప్రాపంచిక విషయాల నుండి నిగ్రహిస్తూ, నన్ను భక్తితో స్మరించటడానికి అభ్యాసము చేయుము.
శ్లోక 10
అభ్యాసేఽప్యసమర్థోఽసి మత్కర్మపరమో భవ |
మదర్థమపి కర్మాణి కుర్వన్సిద్ధిమవాప్స్యసి ||౧౨-౧౦||
అనువాదం
నన్ను భక్తితో స్మరించే అభ్యాసం చేయలేకపోతే నాకోసమే పనులు చెయ్యటానికి ప్రయత్నం చేయుము. ఈ విధంగా భక్తి యుక్త సేవ చేయటం వలన నీవు పరిపూర్ణ స్థాయిని చేరుకోగలవు.
శ్లోక 11
అథైతదప్యశక్తోఽసి కర్తుం మద్యోగమాశ్రితః |
సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్ ||౧౨-౧౧||
అనువాదం
ఒకవేళ నీవు నా కొరకై భక్తితో పని చేయుట కూడా చేయలేకపోతే, నీ కర్మ ఫలములను త్యజించుటకు ప్రయత్నించుము మరియు ఆత్మయందే స్థితుడవై ఉండుము.
శ్లోక 12
శ్రేయో హి జ్ఞానమభ్యాసాజ్జ్ఞానాద్ధ్యానం విశిష్యతే |
ధ్యానాత్కర్మఫలత్యాగస్త్యాగాచ్ఛాన్తిరనన్తరమ్ ||౧౨-౧౨||
అనువాదం
యాంత్రికమైన అభ్యాసము కంటే జ్ఞానం మంచిది; జ్ఞానం కంటే ధ్యానము శ్రేష్ఠమయినది. ధ్యానము కంటే కర్మ ఫల త్యాగం మెరుగైనది, ఎందుకంటే ఇటువంటి త్యాగం చేసిన వెంటనే శాంతి లభించును.
శ్లోక 13 మరియు 14
అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ |
నిర్మమో నిరహఙ్కారః సమదుఃఖసుఖః క్షమీ ||౧౨-౧౩||
సన్తుష్టః సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః |
మయ్యర్పితమనోబుద్ధిర్యో మద్భక్తః స మే ప్రియః ||౧౨-౧౪||
అనువాదం
ఏ భక్తులైతే, సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావన లేకుండా, మైత్రితో/స్నేహపూరితముగా, మరియు కారుణ్యముతో ఉంటారో, వారు నాకు చాలా ప్రియమైన వారు. వారు ఆస్తి/ధనముపై మమకార/ఆసక్తి రహితముగా ఉంటారు మరియు అహంకారము లేకుండా, సుఖ-దుఃఖముల రెండింటి యందు ఒకే విధంగా ఉంటారు మరియు సర్వదా క్షమించే మనస్సుతో ఉంటారు. వారు ఎల్లప్పుడూ తృప్తితో, భక్తితో నాతోనే ఏకమై, ఆత్మ-నిగ్రహంతో, దృఢ-సంకల్పంతో, మరియు మనోబుద్ధులను నాకే అర్పించి ఉంటారు.
శ్లోక 15
యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః |
హర్షామర్షభయోద్వేగైర్ముక్తో యః స చ మే ప్రియః ||౧౨-౧౫||
అనువాదం
లోకమున ఎవ్వరినీ బాధ(క్షోభ) పెట్టని వాడు మరియు ఎవరి చేత ఉద్వేగమునకు గురి కాని వాడు, సుఖాల్లో-బాధల్లో ఒక్కలాగే ఉంటూ, మరియు భయము, ఆందోళన రహితముగా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైన వారు.
శ్లోక 16
అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః |
సర్వారమ్భపరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః ||౧౨-౧౬||
అనువాదం
లౌకిక లాభంల పట్ల అనాసక్తతతో ఉండి, బాహ్యాంతరములలో పవిత్రంగా ఉండి, దక్షతతో, ఉదాసీనంగా, కలతలు లేకుండా, మరియు అన్ని వ్యవహారములలో స్వార్థచింతన లేకుండా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైన వారు.
శ్లోక 17
యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాఙ్క్షతి |
శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్యః స మే ప్రియః ||౧౨-౧౭||
అనువాదం
ఎవరైతే లౌకిక సుఖాల పట్ల ఆనందించకుండా మరియు ప్రాపంచిక కష్టాల పట్ల బాధ పడకుండా ఉంటారో, ఎవరైతే నష్టం జరిగినా బాధ పడరో లేదా లాభం కోసం ప్రాకులాడరో, శుభ-అశుభ పనులను రెంటినీ త్యజిస్తారో, అటువంటి జనులు, భక్తితో నిండి ఉన్న వారు నాకు చాలా ప్రియమైనవారు.
శ్లోక 18 మరియు 19
సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః |
శీతోష్ణసుఖదుఃఖేషు సమః సఙ్గవివర్జితః ||౧౨-౧౮||
తుల్యనిన్దాస్తుతిర్మౌనీ సన్తుష్టో యేన కేనచిత్ |
అనికేతః స్థిరమతిర్భక్తిమాన్మే ప్రియో నరః ||౧౨-౧౯||
అనువాదం
ఎవరైతే, మిత్రులపట్ల మరియు శత్రువుల పట్ల ఒక్కలాగే ఉంటారో, గౌరవము-అపమానముల ఎడ, చలి-వేడిమి పట్ల, సుఖ-దుఖఃముల పట్ల సమబుద్ధితో ఉంటారో, మరియు చెడు సాంగత్యమును విడిచి ఉంటారో; దూషణ మరియు పొగడ్తని ఒక్కలాగే తీసుకుంటారో, మౌనముగా చింతన చేస్తుంటారో, తమకు లభించిన దానితో తృప్తిగా ఉంటారో, నివాసస్థానము పట్ల మమకారాసక్తి లేకుండా ఉంటారో, ఎవరి బుద్ధి స్థిరముగా నా యందే లగ్నమై ఉన్నదో, మరియు ఎవరైతే నాయందు భక్తితో నిండిపోయి ఉన్నారో, అటువంటి వ్యక్తులు నాకు చాలా ప్రియమైనవారు.
కేవలం చదవడం మాత్రమే కాదు—
మీ స్వంత ధ్యాన వీడియోలను సృష్టించండి.
పవిత్ర శ్లోకాలను ప్రపంచంతో పంచుకోవడానికి అందమైన, సినిమాటిక్ వీడియోలుగా మార్చండి. మీ నేపథ్యాన్ని ఎంచుకోండి, మంత్రోచ్ఛారణ ఆడియోను జోడించండి మరియు ఆధునిక ఆకృతిలో గీత వెలుగును ప్రసరింపజేయండి.
ఈ ఫీచర్ల కోసం యాప్ డౌన్‌లోడ్ చేయండి
- అధిక నాణ్యత గల నేపథ్య కళాకృతి
- సమకాలీకరించబడిన సంస్కృత మరియు అర్థ పాఠం
- లీనమయ్యే మంత్రోచ్ఛారణ & సంగీతం
లోతైన అనుభూతిని పొందండి
నిత్య గీత పూర్తి వెర్షన్తో సినిమాటిక్ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించండి. అధిక నాణ్యత గల మంత్రోచ్ఛారణ, ప్రామాణిక అనువాదాలు మరియు మీ అరచేతిలో ఒక ప్రశాంతమైన ధ్యాన అభయారణ్యం.